హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ, పీవైఎల్ సంఘాలు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించాయి. శనివారం ఆయా సంఘాల నేతలు, విద్యార్థులు..బంజారాహిల్స్ లో మినిస్టర్స్ క్వార్టర్స్ వైపు ర్యాలీ నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్‌ను సంఘాల నేతలు అడ్డుకున్నారు.
ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు నేతలను బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ, పీవైఎల్ నేతలు కంపాటి పృథ్వీ, ఎస్.అనిల్, పెద్దింటి రామకృష్ణ, రాకేశ్ మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరుతో కాలక్షేపం చేయకుండా, ఉన్న విద్యాసంస్థలను బలోపేతం చేయాలనీ, బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు నరేందర్, రాకేశ్, గణేశ్, సురేశ్, కృష్ణ, కుమార్, హరీశ్, అనిల్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
